అంతర్జాతీయ కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ ఇంక్.. త్వరలో.. ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పెరోట్ సిస్టమ్స్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్ (పీసీ)ల శ్రేణిలో మరింతగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఈ కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపింది.
టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న డెల్ కంపెనీ.. పెరోట్ సిస్టమ్స్‌ను 3.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. ప్లానో ఆధారిత సంస్థ అయిన పెరోట్ సిస్టమ్స్.. గతంలో 66 శాతం మార్కెట్ షేర్‌ను కలిగి ఉండేది. ఇప్పుడది 68 శాతానికి చేరుకుంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. డెల్ కంపెనీ.. విస్తృతస్థాయిలో కలిగిన తమ వినియోగదారులకు.. పెరోట్ కంపెనీకి చెందిన ఐటీ సేవలను అందించే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించనున్నారు.
కాగా, డెల్ కంపెనీకి ప్రధానంగా ఆదాయం.. పీసీ వ్యాపారం నుంచే వస్తోంది. అయితే అది ఇటీవల.. ఆర్థిక సంక్షోభ ప్రభావానికి లోనయింది. ఈ తరుణంలో.. హెవ్లెట్ పాకార్డ్ వంటి డెల్ కంపెనీ ప్రధాన పోటీదారులు.. వివిధ రకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి దూసుకువచ్చారు. దీంతో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డెల్ ఆదాయం 23 శాతం తగ్గిపోయింది.