త్వరలో ఫ్రీ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ : మైక్రోసాఫ్ట్
సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగానున్న మైక్రోసాఫ్ట్ సంస్థ ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. బ్రెజిల్‌లోని మారో డివో పాలో బీచ్ పేరు మీదుగా ఈ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌కు "మారో" అని నామకరణం చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ మార్కెట్లోకి వస్తే సిమాంటిక్, మెకాఫీలాంటి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిమాంటిక్ కార్పొరేషన్ నార్టన్ యాంటీ వైరస్, మెకాఫీ యాంటీవైరస్‌లతో పోల్చితే మారోలో ఫీచర్లు తక్కువగానే ఉన్నాకూడా ఉచిత వర్షన్ కాబట్టి వినియోగదారుల ఆదరణను చూరగొనే అవకాశం ఉందని సాప్ట్‌వేర్ నిపుణులు భావిస్తున్నారు.
విండోస్ ఎక్స్‌పీ సర్వీస్ ప్యాక్(ఎస్పీ)2, ఆ తరువాత విండోస్ వెర్షన్లు, విండోస్ విస్టా, విండోస్ 7ల్లో మాత్రమే ఈ మారోను వినియోగించుకునే వీలుంది. పంపిణీ ప్రారంభించాక మారోను నేరుగా మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.