ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ ఇంక్ కంపెనీ త్వరలో ఉత్తర కాలిఫోర్నియాలోని విన్‌స్టన్- సేలమ్‌లో డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉత్పత్తి ప్లాంటును మూసివేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి.. ఈ ప్లాంటును మూసివేస్తున్నట్లు తెలిపింది. అలాగే 905 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు వివరించింది.
ప్రస్తుతం వీరిలో 600 మంది ఉద్యోగులను వచ్చే నెలలోనే తొలగిస్తామని డెల్ తెలిపింది. కాగా, ఈ ప్లాంటును 2005లో ప్రారంభించారు. 2011లోగా సంవత్సరానికి 4 బిలియన్ డాలర్ల మేరకు ఆదా చేయాలన్నదే కంపెనీ ప్రణాళికగా డెల్ వెల్లడించింది. ఇందులో భాగంగానే ఈ ప్లాంటును మూసివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది.
ఈ ఏడాది జూలైలో లెబెనాన్, టెనెస్సీ వంటి ప్లాంట్లను జెన్కోకు విక్రయించింది. అలాగే ఐర్లాండ్ ఉత్పత్తి కార్యకలాపాలను పోలెండ్‌కు మార్పు చేస్తున్నట్లు డెల్ ఇటీవలే ప్రకటించింది. అమెరికా, బ్రెజిల్, ఐర్లాండ్, పోలెండ్, చైనా, మలేషియా, భారత్ తదితర దేశాల్లో డెల్‌కు ప్లాంట్లు ఉన్నాయి.