ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » కాశ్మీర్‌లో ప్రీపెయిడ్ కనెక్షన్‌లపై నిషేధం! (Prepaid Mobile | Ban | Jammu Kashmir | Millitants | Home Ministry Department)
జమ్మూ, కాశ్మీర్‌లలోని 38 లక్షల ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఓ అశుభవార్త. భద్రత కారణాలతో జమ్మూ, కాశ్మీర్‌లలో ప్రీపెయిడ్ కనెక్షన్‌లపై నిషేధం విధించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిషేధాన్ని అమలు చేయనున్నారు.
ఒకరికొకరు సంబంధాలు మరియు సమాచారాలను చేరవేసుకునేందుకు మారుపేర్లతో ప్రీపెయిడ్ కనెక్షన్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారని.. భద్రతా దళాలను నివేదికను తయారు చేశాయి. దీనికి సంబంధించి తమ నివేదికలో వివిధ సంఘటనలను భద్రతా దళాలు పేర్కొన్నాయి.
ఈ నివేదికపై సమీక్షించిన హోంమంత్రిత్వ శాఖ ఈ నిషేధం నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ కనెక్షన్‌లతో పాటు కొత్త కనెక్షన్‌లపై కూడా ఈ నిషేధం వర్తించేలా హోం శాఖ చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే.. దీనికి టెలింకా శాఖ విభాగానికి ఆదేశాలు కూడా జారీ అయినట్లు వివరించాయి.
సర్వీసు ప్రొవైడర్లచే తీసుకునే ప్రీపెయిడ్ కనెక్షన్‌లను ఉపయోగించే సదరు వినియోగదారునికి సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉంటోంది. దీని వల్ల నిఘా వర్గాలు మరియు పోలీసుల దర్యాప్తులలో ఇలాంటి కనెక్షన్‌ల సంబంధిత సమాచారం సంక్షిష్టత ఏర్పడుతోంది. కొ్న్ని రకాల కేసుల్లో అయితే ఒకే వ్యక్తి అనేక సర్వీసు ప్రొవైడర్ల కనెక్షన్‌లు కూడా ఉపయోగిస్తుండటం భద్రతా వర్గాలు పరిశీలించాయి.
ఇటీవల దోడా, కుప్వారా, శ్రీనగర్ వంటి జమ్మూ కాశ్మీర్‌లలోని వివిధ ప్రాంతాల్లో అనేక మందిని అరెస్ట్ చేశారు. అయితే వారి పేరుతో ఉగ్రవాదులు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి ప్రీపెయిడ్ కనెక్షన్‌లు పొందినట్లు రూఢీ అయింది. ఈ సెల్‌ఫోన్‌లు కూడా ఇటీవల బాంబు పేలుళ్లలో భాగమైనట్లుగా పోలీసులు కూడా చెబుతున్నారు. దీంతో ఇటీవల పరిణామాల నేపథ్యంలో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.