ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఇంటర్నెట్ సామ్రాజ్యానికే అధిపతి కావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ గత కొద్ది కాలంగా పలు చిన్న, పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తుంది. ఈ వరుసలోనే తాజాగా మరో కంపెనీను గూగుల్ కొనుగోలు చేసింది. శాన్‌మాటియో కేంద్రంగా పనిచేస్తున్న విజువల్ సెర్చింజన్ 'లైక్ డాట్ కామ్'ను గూగుల్ సొంతం చేసుకుంది.
ఆరేళ్ల క్రితం స్థాపించిన లైక్ డాట్ కామ్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌తోపాటు ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ షాపర్స్‌కు ఉపయోగపడే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు విజువల్ షాపింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. గూగుల్‌తో చేతులు కలపడం తమకు ఎంతో ఆనందంగా వుందని లైక్ డాట్ కామ్ వ్యవస్థాపకులు, సి.ఇ.ఓ ముంజల్‌షా అన్నారు.
అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే విషయాన్ని ఇరు కంపెనీలు ప్రస్తావించలేదు. కానీ.. లైక్ డాట్ కామ్ విలువ 100 మిలియన్ అమెరికన్ డాలర్లు వుంటుందని టెక్నాలజీ బ్లాగుల్లో ఒకటైన టెక్‌క్రంచ్ పేర్కొంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో గూగుల్ ఇప్పటి వరకూ 20 కంపెనీలను కొనుగోలు చేసింది.