2007-2008 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బిడీఎస్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెల్సిందే. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ఈనెల 30వ తేదీన సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తుంది.
తొలి రోజున వెయ్యి మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ కోసం అయిదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలోను, హైదరాబాద్‌లో ఉస్మానియాలోని దూరవిద్యా కేంద్ర భవనంలోను, జెఎన్‌టీయు క్యాంపస్‌లోను, విశాఖలో ఆంధ్రా మెడికల్ కళాశాల, తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలోను కౌన్సెలింగ్ జరుగుతుంది.
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమకు అనుకూలమైన ఏ కేంద్రంలోనైనా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎంబిబిఎస్‌కు సంబంధించి 25 మెడికల్ కళాశాలలలోని సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇందులో 11 ప్రభుత్వ, 14 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిలోను కలిపి మొత్తం 3400 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా, 30శాతం ప్రైవేట్ కళాశాలల మేనేజ్‌మెంట్ కోటా కింద పోగా నికరంగా 2860 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు.
అలాగే, బిడిఎస్‌కు సంబంధించి మొత్తం 18 కళాశాలలు ఉండగా, ఇందులో రెండు ప్రభుత్వ, 16 ప్రైవే ట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1530 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 1073సీట్లను భర్తీ చేస్తారు.
|