జలయజ్ఞం పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు ఆరోపించారు. శ్రీరాంసాగర్ సమస్యల పరిష్కారానికి 350 కి.మీ మేర బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. శ్రీరాంసాగర్ కింద వాస్తవానికి మూడులక్షల ఎకరాలే సాగుబడి అవుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ శ్రీరాంసాగర్ సమస్య పరిష్కారంతో పాటు కాలువ ఆధునీకరణ, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టే వరకు తీవ్ర ఆందోళన చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. జలయజ్ఞం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు.
ఈ బస్సు యాత్రను నల్గొండ నుంచి ఆదిలాబాద్ వరకు చేపట్టనున్నట్లు కేసీఆర్ వివరాలందించారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లోని నీరందించే ప్రధాన కాలువలను, పంటలను సాగునీటి కాలువలను పటిష్టం చేసి 15లక్షల ఎకరాలకు సాగునీరందించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
|