గడచిన పదిసంవత్సరాల కాలంలో తీవ్రవాదం కారణంగా దేశంలో 71,000 మంది బలైపోయినట్లు కేంద్ర నేరపరిశోధక విభాగం (సీబీఐ) పోలీస్ సూపరింటెండెంట్ ఏ. సాయి మనోహర్ పేర్కొన్నారు. స్థానికంగా గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఆధ్వర్యంలో అకడమిక్ స్టాఫ్ కాలేజీలో "భారతదేశంలో అంతర్గత భద్రత" అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
మతపరమైన మరియు ఇతర కారణాల మూలంగా కూడే జనసమూహాలను లక్ష్యంగా పెట్టుకుని తీవ్రవాదులు జనహననం సాగిస్తున్నారని మనోహర్ తెలిపారు. తద్వారా ప్రజల ప్రాణాలను హరించడమే కాక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాలలో చోటు చేసుకున్న తీవ్రవాదుల దాడులలో చనిపోయిన ప్రజల వివరాలను గణాంకాల రూపంలో మనోహర్ వెల్లడించారు.
|