ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేటి సరస్సుకు వలస పక్షులు తిరిగి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని కృష్ణ, గోదావరి జిల్లాలను ఆవరించి ఉన్న మంచినీటి సరస్సుగా పేరు పొందిన కొల్లేటి సరస్సుకు పక్షుల రాక ప్రారంభమయ్యిందని కొల్లేరు అభయారణ్య నిర్వహణ విభాగం బుధవారం పేర్కొంది.
అక్టోబర్ మాసాంతానికి దక్షిణాఫ్రికాకు చెందిన పక్షులు కూడా సరస్సుకు చేరుకునే అవకాశం ఉందని డివిజినల్ అటవీ అటవీ అధికారి జి.నిరంజన్ మీడియాతో అన్నారు. సైబీరియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పక్షులు కూడా భారీ సంఖ్యలో ఇదేకాలంలో సరస్సును చేరుకుంటాయని నిరంజన్ తెలిపారు. వలస పక్షులకు చోటు కల్పించేందుకు గాను వేలసంఖ్యలో స్థానిక పక్షులు సరస్సు పరిసరాలలోని సురక్షిత ప్రాంతాలకు పయనమవుతాయని అన్నారు.
పక్షులుకు అనువుగా ఉండేందుకు గాను సరస్సు పరిసరాలలో అటవీ శాఖ 5,000 మొక్కలు నాటిందని తెలిపారు. సరస్సులో వేటను గతసంవత్సరం నిషేధించినట్లు నిరంజన్ పేర్కొన్నారు. నిషేధం అమలుకు గాను పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
|