అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అదే సమయంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్ శాసనసభా పక్షం సమీక్షా సమావేశాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో శాసనసభా సమావేశాలకు 21 అంశాలు ప్రధానంగా చేసుకుని హాజరుకానున్నట్టు తెలుగుదేశం శాసనసభా పక్షం ప్రకటించింది.
శనివారం టీడీఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ విఫ్ పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ ఉపనేత ఎర్రబల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ.. శాసనసభా సమావేశాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విధానపరమైన అంశాలపై చర్చ జరిపేందుకు పాలకపక్షం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అవసరమైతే అదనపు సమయాన్ని కేటాయించి ప్రజల సమస్యలపై తగురీతిన స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కోరారు. ఇదిలావుండగా.. వరికి కనీస మద్దతు ధర, జలయజ్ఞంలో చోటు చేసుకున్న అవకతవకలు, లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్ బండార్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుతో రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం తదిర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంది.
|