రాష్ట్రంలోని వెనుకబడిన కులాలకు నిర్దేశించిన సంక్షేమ వసతి గృహాలలో పరిస్థితి అధ్వాన్నంగా ఉండటాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, వామపక్షాలు మరియు భారతీయ జనతా పార్టీ సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి.
గడచిన మూడు సంవత్సరాలుగా సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్ కేటాయింపులను కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం సద్వినియోగం చేయలేదని ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వసతి గృహాలలో కనీస వసతులు మృగ్యమైపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో 340 మంది పిల్లలు పలు రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతకు పూర్వం తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత దేవేందర్ గౌడ్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సుభాష్ చంద్రబోస్ సమాధానమిస్తూ సంక్షేమ వసతి గృహాల సంక్షేమం కోసం తెలుగుదేశం హయాంలో కన్నా మిన్నగా ప్రస్తుత ప్రభుత్వం మూడు దశలలో రూ.120 కోట్లను ఖర్చు చేసిందని అన్నారు.
|