శ్రీకాకుళం జిల్లాలోని పలాస మున్సిపాలిటీకి జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. మొత్తం 25 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 14 వార్డులను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం ఏడు స్థానాలతోనే సరిపుచ్చుకుంది. మిగిలిన వార్డులను స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పలాస మున్సిపాలిటీ ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల స్థానిక జిల్లా నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఇటీవల కొన్ని సర్వేలు కూడా వెల్లడించాయి. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీయవచ్చని అన్ని పార్టీల నేతలు ఊహించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ -14, తెదేపా-7, స్వతంత్రులు-4 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఊరట కలిగించాయి. అంతేకాకుండా.. పలాస, కాశీబుగ్గ మున్సిపల్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
|