రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యస్థలమైన తిరుపతిలో దైవ దర్శనార్థం వచ్చే రైలు ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను కల్పించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తిరుపతి-కట్పాడిల మధ్య విద్యుదీకరణ రైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి లాలూ ప్రసంగిస్తూ.. దేశంలో కొన్ని నగరాల్లో నడుస్తున్న గరీభ్‌రథ్‌లను సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
అన్ని రాష్ట్రాల నుంచి గరీభ్‌రథ్ రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు లాలూ వివరించారు. అంతేకాకుండా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తొలివిడతలో లూథియానా-, హౌరా, ఢిల్లీ-ముంబై మార్గాలను ఎక్స్‌ప్రెస్ లైన్లుగా తీర్చిదిద్ధుతామని లాలూ చెప్పారు. ఆ తర్వాత చెన్నై-హౌరా, చెన్నై-ముంబైల మధ్య ఎక్స్‌ప్రెస్ మార్గాలను ఏర్పాటు చేస్తామన్నారు.
|