రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై శుక్రవారం స్పందిస్తూ.. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీరామారావు పార్టీ స్థాపించినప్పటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. అందువల్ల మూడో వ్యక్తి పార్టీ స్థాపించినప్పటికీ.. స్థిరపడటం చాలాకష్టమన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చాలా బలోపేతంగా ఉన్నాయన్నారు.
అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్ర రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయన్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండకుండా పరిస్థితులకు అనుగుణంగా క్రియాశీలకంగా రాజకీయాలు మారుతుంటాయన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు.
అయినా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. చిరంజీవి గ్లామర్, ఇతర సెంటిమెంట్‌లు ఎన్ని ఉన్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఢోకా ఏమీ లేదని మొయిలీ ధీమా వ్యక్తం చేశారు.
|