ఆచరణసాధ్యంకాని హామీలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి తొమ్మిది గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్తు, గృహ వినియోగ విద్యుత్ ఛార్జీల తగ్గింపు తదితర అలవికాని వాగ్దానాలను చంద్రబాబు గుప్పిస్తున్నారని మీడియా ఎదుట ఆరోపించారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీని తూర్పారబట్టడంలో చంద్రబాబు ముందు నిలిచారని రోశయ్య అన్నారు. కేవలం రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. గడచిన మూడు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏడుగంటల విద్యుత్ సరఫరా చేసిందని మంత్రి అన్నారు. అదేసమయంలో గృహ విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఛార్జీలను 10 శాతం తగ్గించిన అంశాన్ని ఈ సందర్భంగా రోశయ్య ప్రస్తావించారు.
|