తమ పార్టీకి చెందిన సభ్యులు శాసనసభ, విధాన మండలి సమావేశాలకు సక్రమంగా హాజరుకాకపోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులతోపాటు మంత్రులు సైతం సభాకార్యక్రమాలకు గైర్హాజరు కావడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సభాకార్యక్రమాలు వాయిదా పడిన అనంతరం మాత్రమే శాసనసభ్యులు సందర్శకులతో సమావేశం కావాలని ఆయన సూచించారు.
సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికార పక్ష సభ్యులు శాసన సభ, విధాన మండలి సమావేశాలకు గైర్హాజరు అవుతున్న అంశం ప్రస్తావనకు వచ్చింది. సభాకార్యక్రమాలు జరుగుతున్న సమయంలో సభా ప్రాంగణాలలో వ్యక్తిగత సమావేశాలకు స్వస్తి చెప్పవలసిందిగా మంత్రులు, శాసనసభ్యులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతిగృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అధ్యయనం చేయవలసిందిగా రాజశేఖరరెడ్డి వారిని కోరారు. అధ్యయన నివేదికలను సమర్పించిన అనంతరం సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
|