నష్టాల ఊబిలో కూరుకుని పోతున్న దేశ రైతాంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర విత్తమంత్రి చిదంబరం చేసిన సాహసం పట్ల ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు విత్తమంత్రి ప్రకటించడం హర్షణీయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన వల్ల రాష్ట్రంలో 12 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అవుతాయని ఆయన వివరించారు.
చిదంబరం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై వైఎస్సార్ స్పందిస్తూ దేశంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ శుక్రవారం నిజమైన పర్వదినమని వైఎస్ ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తమ ప్రభుత్వం చేసిన విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించినందుకు చిదంబరానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వైఎస్సార్ చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని మహోన్నత పాఠశాల స్థాయిలో అమలు చేయనున్నట్టు ప్రకటించడం పట్ల తమ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోందన్నారు.
|