ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. ఇదే అంశాన్ని తమ పార్టీ గుర్తు చేస్తోందన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో ఒక మీడియాతో మాట్లాడుతూ.. సెంటిమెంట్ అనేది కేవలం తెలంగాణా రాష్ట్ర సమితి సొత్తు కాదని ఎద్దేవా చేశారు. సెంటిమెంట్‌ను ఒక సమస్యగా చూపిస్తూ.. లేని సమస్యలను తెరాస సృష్టిస్తోందని వైఎస్ ధ్వజమెత్తారు.
అందువల్ల ఈ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా భావించబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా వాసుల్లో సెంటిమెంట్ ఉందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెపుతోందని, ఇందులో తెరాస కొత్తగా చెప్పేదేమిటని వైఎస్సార్ ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు వైఎస్ జోస్యం చెప్పారు.
|