ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధినేత కే.చంద్రశేఖర రావే ప్రధాన అడ్డంకి అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈనెల 29వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జీవన్ రెడ్డి, తన ప్రచారంలో కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు, ఉప ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణా ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీ వేస్తామంటే కేసీఆర్ 'యముడు'లా అడ్డుపడ్డారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అధికార దాహంతో కేసీఆర్ తెలంగాణా వాదాన్ని తన ఇంటి సొత్తుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ అవకాశవాదాన్ని బట్టబయలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా తెరాస నేతలు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేశారని ఆయన ఆరోపించారు. తెరాస నేతలు చేస్తున్న రాజకీయం వల్ల తెలంగాణా అంశంపై ఏకాభిప్రాయం కుదరటం లేదని జీవన్ రెడ్డి వివరించారు.
|