చెన్నైలో మూతపడిన గోల్డ్‌క్వెస్ట్ ప్రకంపనలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కూడా తాకాయి. నగరంలోని హిమాయత్ నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలను బాధితులు ముట్టడించి, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంస్థలో తమ అభిమాన నటులు భారీగా పెట్టుబడులు పెట్టడంతో తామూ పెట్టామని పలువురు బాధితులు వాపోతున్నారు.
బంగారు నాణేలను ఎరగా చూపి, చైన్ లింక్ పథకం కింద గోల్డ్‌క్వెస్ట్ సంస్థ కోట్లాది రూపాయలను వసూలు చేసిన విషయం తెల్సిందే. ఈ సంస్ధ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఈ సంస్థ కార్యాలయం చెన్నైలో మూతపడటంతో ఆందోళనకు గురైన బాధితులు రాజధానిలోని ఆ సంస్థ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున గుమికూడారు.
చిత్ర పరిశ్రమలో చిచ్చు...? గోల్డ్‌క్వెస్ట్ కుచ్చుటోపీ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదానికి దారితీస్తోంది. ఈ సంస్థలో ప్రముఖ నటుడు చంద్రమోహన్, ఆయన భార్య, మేనకోడలు ప్రధాన లబ్దిదారులుగా ఉండటమే కాకుండా.. అనేక మందిని చేర్పించినట్టు వార్తలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో చంద్రమోహన్ చిత్ర పరిశ్రమపై లేనిపోని ఆరోపణలు చేశారు. దీనిపై నిర్మాతల మండలి తక్షణం స్పందించింది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ గోల్డ్‌క్వెస్ట్‌కు, చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రమోహన్ చిత్ర పరిశ్రమపై అసందర్భ వ్యాఖ్యలు చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
|