గత 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని, ఈ పరిశ్రమ తనకు కన్నతల్లిలాంటిదని ప్రముఖ నటుడు చంద్రమోహన్ అన్నారు. గోల్డ్‌క్వెస్ట్ వివాదంలోకి తనను లాగొద్దని ప్రాధేయపడ్డారు.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌క్లబ్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గోల్డ్‌క్వెస్ట్ వివాదంలో తెలుగు సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఒక వేళ ఎవరినైనా క్షోభకు గురిచేసివున్నట్టయితే క్షమించాలని చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు. గోల్డ్‌క్వెస్ట్ వివాదంలో తన పేరు బయటకు రావడం దురదృష్టకరమన్నారు. అందువల్ల ఈ వివాదంలోకి లాగొద్దని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే గత 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా, తనపై ఇప్పటి వరకు ఒక ఫిర్యాదు కూడా లేదని చంద్రమోహన్ గుర్తు చేశారు. చెన్నై కేంద్రంగా పని చేసే గోల్డ్‌క్వెస్ట్ సంస్థ బంగారు నాణేలు ఎరచూపి కోట్లాది రూపాయల మేరకు వసూలు చేసింది. ఈ సంస్థ ప్రస్తుతం బోర్డు తిప్పేయడంతో అనేక మంది పోలీసులను ఆశ్రయించారు.
ఈ పరిస్థితుల్లో చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఈ గోల్డ్‌క్వెస్ట్ సంస్థ వ్యాపారంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు నిర్మాతల మండలి, 'మా'లు తీవ్రంగానే స్పందించాయి. దీంతో చంద్రమోహన్ భేషరతు క్షమాపణ కోరారు.
|