బ్రిటన్‌లోని బర్మింగ్‌హ్యామ్‌లో హెల్త్‌సైన్సెస్‌లో పీజీ చేస్తున్న విజయవాడకు చెందిన జ్యోతిర్మయి (23)ని హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నాగరాజు హతమార్చినట్లు లండన్ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు అతనిని శుక్రవారం బర్మింగ్‌హ్యామ్ కోర్టులో హాజరుపరుచనున్నారు. బ్రిటన్‌లో వైద్య విద్య చదువుతున్న జ్యోతిర్మయి గత మంగళవారం సాయంత్రం హత్యకు గురైన విషయం తెల్సిందే.
హత్య విషయమై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు జరిపి, నాగరాజు అనే వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో నాగరాజే జ్యోతిర్మయిని హత్య చేసినట్లు ధృవీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. జ్యోతిర్మయి భౌతిక కాయ పంచనామా పరీక్షల్లో ఆమె తలపై దాడి చేయడంతో తీవ్రగాయం తగలడంతో మరణించినట్లు తేలిందని బ్రిటన్ పోలీసులు వెల్లడించారు.
హత్య జరిగిన స్థలంలో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన అధికారులు ఆ ప్రాంతంలో నివసించే వారివద్ద దర్యాప్తు జరుపుతున్నారు. గత మూడేళ్ల కాలంలో బ్రిటన్‌లోని బర్మింగ్ హ్యామ్‌లో ప్రాంతంలో భారతీయులు హత్యకు గురికావడం ఇది మూడోసారి.
|