పనికరం మల్లయ్య... తెలంగాణా ప్రాంతంలోని వరంగల్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ఓ సాధారణ రైతు. ఈ రైతు నుంచి తనకు పెద్ద చిక్కు వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించి ఉండరు. 'మీ కోయం' యాత్రలో భాగంగా చంద్రబాబు ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు.
ఈ పర్యటనలో భాగంగా వర్థన్నపేట నియోజకవర్గం, రాయపర్తి మండలం మల్లారంలో ఆయన రోడ్‌షోలు నిర్వహించారు. అపుడు రైతుల మధ్యకు వెళ్లి... రైతుల కోసం ఇంకా ఏమి చేస్తే బాగుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రైతుల మధ్యలో ఉన్న పనికరం మల్లయ్య అనే ఓ సాధారణ రైతు ముందుకు వచ్చి.. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇప్పిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు.
దీంతో దిక్కుతోచని బాబు.. సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి జారుకున్నారు. ఈ పనికరం మల్లయ్య ధైర్యాన్ని మెచ్చుకున్న తెరాస మాత్రం ఆయన్ను ఆకాశానికి ఎత్తేసింది. తెలంగాణా ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి మల్లయ్య ఆదర్శమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు అంటున్నారు. అంతే మరి... ఎన్నికల వేళ. రైతు వ్యాఖ్యలే తెరాస నేతలకు బలమైన ఆయుధం.
|