రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పునరంకిత సభను నిర్వహించారు. ఈ సభ బుధవారం నిరాడంబరంగా ఈ సభ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా డీఎస్ ప్రారంభోత్సవం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్న ఘనత వైఎస్ సర్కారుదేనన్నారు. గత తొమ్మిదేళ్ళ పాలనలో సాగునీటి రంగాన్ని తెదేపా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన డీఎస్.. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పనులను ఆరు నూరైనా పూర్తి చేస్తామని ప్రకటించారు.
అనంతరం ఆర్థిక మంత్రి రోశయ్య మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకు కొన్ని దుష్టశక్తులు అడ్డు తగులుతున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం మడమ తిప్పే ప్రసక్తే లేదని రోశయ్య స్పష్టం చేశారు. అలాగే.. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ.. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 'మనస్సులో మాట' అనే పుస్తకం రాశారని, అందులో సంక్షేమ పథకాలను వ్యతిరేకించిన చంద్రబాబు, ప్రసుత్తం వాటి ఊసెత్తే అర్హత కూడా లేదన్నారు. అధికారం కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు 420తో సమానమని ఉండవల్లి ధ్వజమెత్తారు.
|