'మీ కోసం' యాత్రలో నిమగ్నమై వున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా 'మీ కోసం' యాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబు శుక్రవారం స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. శనివారం మాత్రం తీవ్ర జ్వరంతో బాధపడటంతో ఆయన నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.
ఇదిలావుండగా చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. తమ నేత త్వరగా కోలుకోవాలని వారు వారు తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పాలనను ఎండగడుతూ, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా చంద్రబాబు 'మీ కోసం' యాత్రను ప్రారంభించిన విషయం తెల్సిందే.
ఇప్పటికే 2006 కిలోమీటర్ల దూరం సాగిన బాబు యాత్రకు వరంగల్‌లో బ్రేక్ పడింది. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో ఆయన అస్వస్థతకు గురవుతున్నారు. ఇదిలావుండగా అనారోగ్యానికి గురైన చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెదేపా సీనియర్ నేతలు పరామర్శిస్తున్నారు.
|