రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వేలం పాటలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం మంగళవారం ధర్నా నిర్వహించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో మద్యం దుకాణాలు వేలం పాటలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని వేలం పాటలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరితో లోక్‌సత్తా పార్టీ కార్యకర్తలకు కూడా జత కలిశారు.
దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన చేసిన తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే.రోజా మాట్లాడుతూ మద్యం వల్ల రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్సులను ఇష్టానుసారంగా ఇస్తోందని, దీనివల్ల వీధికొకటి చొప్పున బెల్టు షాపులు వెలుస్తున్నాయన్నారు. అందువల్ల మూడు వేల రూపాయలు ఉన్న మద్యం ఆదాయం ప్రస్తుతం 12 వేల కోట్లకు చేరుకుందన్నారు. గతంలో కంటే ఈ దఫా 50 శాతం మేరకు అధిక ఫీజులకు మద్యం షాపుల వేలం జరుగడం గమనార్హం.
|