చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులను ఆటకట్టిస్తామని రాష్ట్ర హోం మంత్రి కె.జానారెడ్డి హెచ్చరించారు. ఇందుకోసం గ్రేహౌండ్స్ దళాలకు మరింత అధునాతన శిక్షణ ఇప్పిస్తామని ఆయన తెలిపారు. మవోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులను పరిరక్షిస్తున్న పోలీసులపై మావోయిస్టులు దాడి చేయడం పిరికి చర్యగా పేర్కొన్నారు.
మావోయిస్టులపై నిఘాను మరింత పటిష్టం చేస్తామని జానారెడ్డి తెలిపారు. నిఘా సంస్థలు పరిస్థితి తీరును ముందే పసిగట్టి చెప్పిందని ఆయన ప్రతినిధులడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేసిన 19 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఎదురుదాడి ఎన్నడూ జరుగలేదని మంత్రి తెలిపారు.
గ్రేహౌండ్స్ పోలీసులు చిత్రకొండ వద్దనున్న రిజర్వాయర్‌ను దాటుతారనే విషయాన్ని మావోయిస్టులకు ముందుగానే సమాచారం అందిందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ దాడిలో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొని ఉండవచ్చని ఆంచనా వేసినట్టు తెలిపారు. తెదేపా హయాంలో 1150 మంది మావోయిస్టులు ఉండేవారని, ఆ సంఖ్య ప్రస్తుతం 470కి పడిపోయిందని మంత్రి జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
|