రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి)లో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రతినిధి ఎం.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కరానికై ఈ నెల 19, 20 తేదీలలో సమ్మె జరుపనున్నట్లు తెలిపారు.
ఆర్టీసిలో ప్రస్తుతం సేవలను అందిస్తున్న 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. వీరందరికీ రెగ్యులర్ కార్మికులకు ధీటుగా వేతన భత్యాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసి సంస్థలో అద్దె బస్సులను తొలగించాలని మరోమారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అద్దె బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని కోరారు. ఇదిలావుండగా, తాము తలపెట్టిన సమ్మెపై కార్మిక శాఖకు నాలుగో తేదీన సమ్మె నోటీసు అందజేస్తామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించక పోతే తాము నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. కాగా ఆర్టీసి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వైఎస్సారు సానుకూలంగా స్పందించారని డ్రైవర్స్, కండక్టర్స్ యూనియన్ నేతలు అభిప్రాయపడ్డారు.
|