ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకునే అంశంపై ఇప్పుడే తుదినిర్ణయం తీసుకోలేమన్నారు.
తమ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణా వాదంతోనే ప్రజల ముందుకు తీసుకెళ్లతామని ఆయన తెలిపారు. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో తెదేపా వంద స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి రాయలసీమ, కోస్తా జిల్లాల నేతలను ఒప్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెదేపాలో నెంబర్ టూగా ఉండిన దేవేందర్ గౌడ్ స్వార్థంతోనే పార్టీని వదిలి వెళ్లిపోయారని ఎర్రబెల్లి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు దేవేందర్ గౌడ్‌ను నమ్మటం లేదన్నారు.
|