పరిటాల రవి హత్యకేసు ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. అనంతపురం సెషన్స్ కోర్టులో బుధవారం ఉదయం ప్రారంభమైన విచారణ సందర్భంగా పోలీసులు కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, కోర్టు విచారణలో మొదటి సాక్షిగా.. ఈ కేసులో అఫ్రూవర్‌గా మారిన రామ్మోహన్ రెడ్డి పలు విషయాలను వెల్లడించాడు.
చర్లపల్లి జైల్లో ఉన్న మద్దెల చెర్యు సూరికి సెల్‌ఫోన్ , సిమ్‌కార్డులు అందజేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. రెండు సార్లు పరిటాల రవిని హత్యచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యామని తెలిపాడు. చక్రవర్తి టవర్స్, ఎస్.ఎస్.టవర్స్ వద్ద తాము తరచుగా కలుసుకునే వాళ్లమని తెలిపాడు.
ఇందులో భాగంగానే గార్లదిన్నెలో పరిటాల రవి హత్యకు రిహార్సల్స్ వేశామని, గన్‌ఫైరింగ్‌కు కూడా తానే శిక్షణ ఇచ్చానని వెలిబుచ్చాడు. మొదటిసారి పెనుగొండ కాళేశ్వర్ వివాహానికి హాజరైనప్పుడు, సోందేవి పల్లి జడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో పరిటాల పాల్గొన్నప్పుడు మరోసారి హత్య చేసేందుకు ప్రయత్నించామని అన్నాడు.
చివరికి 2005 జనవరి 24న సూరి పన్నాగం ఫలించి టీడీపీ కార్యాలయంలో పరిటాల రవిని హత్య చేసినట్లు రామ్మోహన్ వెల్లడించాడు. పరిటాల రవి హత్యకు సహకరించాలని సూరి తనను జైల్లో కోరినట్లు రామ్మోహన్ తన వాగ్మూలంలో తెలిపిన సంగతి తెలిసిందే. విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో, మొద్దుశీను కోర్టుకు హాజరు కాలేదు.
|