రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న చిరంజీవి పెట్టనున్న రాజకీయ పార్టీకి అన్ని పార్టీ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చిరంజీవి సన్నిహితుడు డాక్టర్ మిత్రా వెల్లడించారు. వారధి పేరుతో నిర్వహించిన మహిళా అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పార్టీ స్థాపనకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని తెలిపారు.
చిరంజీవి తుది నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ఆయన కొత్త కాలం తర్వాత తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పిన మాటకు గౌరవం ఇద్దామని మిత్రా చెప్పారు. తమ పార్టీలో చేరడానికి వివిధ రాజకీయ నాయకులు అనేక మార్గాల్లో సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు.
తాము నిర్వహించే సమావేశాల్లో హాజరయ్యే వారిని కార్యకర్తలుగా చేర్చుకోవడానికై ప్రవేశ పత్రాలను ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగంపై తమశక్తిని నిరూపించాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి వారధి పేరుతో సహాయక కేంద్రాలను నెలకొల్పాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడిచిన ఉపఎన్నికల్లో చాలా చోట్ల స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకోలేదని ఆయన గుర్తుచేశారు.
|