సామాజిక పింఛన్లకు అర్హులైన వారికి అక్టోబర్ నుంచి అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనితో రాష్ట్రంలో పింఛన్లు 70లక్షలకు చేరుకుంటాయని ఆయన అంచనా వేశారు. పింఛన్లకు నెలకు సుమారు 160 కోట్లు వెచ్చించాల్సి ఉందని సీఎం తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఇందిరమ్మ ఇళ్ల పునాదుల తవ్వకానికి కేటాయించే రూ.3,200ను తక్షణమే ఆపివేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల మళ్ళింపుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఓ లేఖను రాసింది.
దీనిపై కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లు వివరణ కోరడంతో ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయిస్తున్న రూ. 3200 ఉపాధి హామీ నిధులను తక్షణమే నిలిపి వేయాలని సూచించారు. గతంలో ఉపాధిహామీ నిధులను ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో కలిపి పల్లెల్లో సిమెంటు రోడ్ల పనులను కూడా నిలిపివేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎక్కడా ఉపాధి హామీ పథకాలకు ఆటంకం కలిగించలేదని వైఎస్ ఈసందర్భంగా తెలిపారు. కూలీల, రైతుల మధ్య కొన్ని పార్టీలు తగాదాలు సృష్టిస్తున్నాయని వైఎస్సార్ ఆరోపించారు. గ్రామసభల ద్యారా ఉపాధి హామీ పథకాలను స్థానికంగా చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.
ఉపాధి పనులు గుంటూరు, వరంగల్ జిల్లాల్లో వెనుకంజలో ఉన్నాయని, వందరోజులైన పనులు కల్పించకపోతే ఎలా అని ఆయన కలెక్టర్లను ప్రశ్నించారు. ఇందిరమ్మ చెరువుల పనులు త్వరలో పూర్తికావాలని ఆయన అధికారులను ఆదేశించారు
|