సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ గాలులు మెల్లగా కాంగ్రెస్ పార్టీని కూడా తాకుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ అసంతృప్తులు చిరు రైలుబండి ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి స్థాపించే రాజకీయ పార్టీలో చేరేందుకు తెదేపాకు చెందిన పలువురు నేతలు క్యూలో ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, పుత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా చిరు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఆయన బాటలోనే నడువనున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకు నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు తన హితులు, సన్నిహితులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. గత 1983 నుంచి పుత్తూరు స్థానం నుంచి పోటీ చేసి గెలుస్తూ వచ్చిన ఆయన 1999 ఎన్నికల్లో ఓడిపోయారు.
మళ్ళీ 2004 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి లభిస్తుందని ఆయన ఆశించారు. చిత్తూరు జిల్లా నుంచి గల్లా అరుణ కుమారి, చెంగారెడ్డిలకు మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ఆయన నిరుత్సాహానికి లోనయ్యారు. దీంతో ముద్దుకృష్ణమ నాయుడు పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొనడం లేదు.
|