దళితుల మనోభావాలను కించపరిచే విధంగా ఎన్టీఆర్ "కంత్రి"లోని కొన్ని సన్నివేశాలున్నాయంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపణలకు ఆ చిత్ర దర్శకుడు రమేశ్ వివరణ ఇచ్చారు. దళితుల మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని, కంత్రి చిత్రంలో అంబేద్కర్ విగ్రహమున్న ప్రాంతంలో నేరస్థులున్నట్లు చిత్రీకరించడం కాకతాళీయంగానే జరిగిందని అన్నారు.
ఒకవేళ ఎవరికైనా తమ చిత్రం అలాంటి భావం కల్పిస్తే అందుకు క్షమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ చిత్రం వల్ల దళితుల మనోభావాలు దెబ్బతింటే అందుకూ క్షమించాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, కంత్రి చిత్రంలోని కొన్ని సన్నివేశాలు దళితుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆదివారంలోగా తొలగించినట్లైతే ఆందోళన బాట పడతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
ఈ చిత్రంలోని అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించని పక్షంలో సెన్సార్ బోర్డు కార్యాలయం, ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్విహిస్తామని మందకృష్ణ మీడియా ప్రతినిధులతో అన్నారు.
|