పార్టీపై త్వరలో మరింత స్పష్టమైన ప్రకటన చేస్తానని తెదేపా మాజీ నేత దేవేందర్ గౌడ్ తెలిపారు. ఆగస్టులో పార్టీని ఏర్పాటు చేస్తానని, పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని, వేదికల అందుబాటు ఇతరత్రా విషయాలపై కసరత్తు జరుగుతోందని గౌడ్ వెల్లడించారు. ప్రత్యేక తెంగాణపై తెదేపా త్వరలో అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ చెబుతున్న దానిని ప్రజలు ఏమాత్రం నమ్మరని ఆయన చెప్పారు.
తెదేపా ఒకవేళ అనుకూల నిర్ణయం తీసుకున్నా అదీ అవకాశవాదం, మోసపూరితమేనని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా మాట్లాడారు. విశ్వసనీయత లేని పార్టీలను ప్రజలు నమ్మబోరని, తెదేపా, తెరాసలు చేతులు కలిపితే జరుగబోయేదీ ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు.
చిరంజీవి పెట్టబోయే పారటీ విధానాల ఆధారంగా ఆ పార్టీతో పొత్తు ఉంటుందని దేవేందర్ స్పష్టం చేశారు. దేవేందర్ మంచి నేత అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీని నెలకొల్పి, దానికీ సారథ్యం వహించే సామర్థ్యం ఆయనకు లేదన్న రోశయ్య వ్యాఖ్యలపై దేవేందర్ స్పందిస్తూ... తాను రోశయ్య అంతా పొడవు, లావు లేకపోయినప్పటికీ ప్రజల అండతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని చెప్పారు. ప్రజల సహకారంతో ప్రత్యేక తెలంగాణాను ముందుకు తీసుకెళ్తానని ఉద్ఘాటించారు.
|