టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన విధానాల వల్లే నేడు రాష్ట్రంలో కరెంటు కోత విధించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోపించారు. గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో విద్యుత్ రంగానికి జరిగిన నిర్లక్షమే నేడు కరెంటు కోత రూపంలో ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎదురవుతోన్న కరెంటు కష్టాలపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ రంగం వృద్ధి సాధించాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలి. దాని ప్రకారం ఏదైనా ఓ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించాలంటే దానికి కొంతకాలం పడుతుంది. కానీ నాటి టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాలేవీ చేపట్టకుండా అలక్ష్యం చేసిందని వైఎస్ తన లేఖలో పేర్కొన్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆనాడు కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన తన బహిరంగ లేఖలో తెలిపారు. అయితే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కరెంటు కొరతను నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. కానీ ఇదేమీ అర్ధం చేసుకోకుండా టీడీపీ కరెంటు సమస్యను రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు.
|