శ్రీకాకుళం ప్రధాన రహదారిలో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 36మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో దాదాపు పదిమంది పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసుల వివరాల ప్రకారం సీతంపేట మండలం జొన్నగూడ, బుర్ర వలస గ్రామాలకు చెందిన గిరిజనులు కూలికోసం సరుగుజ్జిలికి బయలుదేరారు. వీరంతా ఓ వ్యానులో ప్రయాణిస్తుండగా వ్యాను టైర్ పగిలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం కిందపడి కొద్దిమంది మరణించగా ఎగిరిపడ్డవారు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం చోటు చేసుకున్న బూర్జు మండలం పెద్దపేట సమీపంలోని ఈ ప్రాంతం క్షతగాత్రుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఈ ఘటనలో గాయపడ్డవారిని శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|