తనకూ రౌడీయిజం తెలుసునని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తనపై మంత్రి దామోదర్ రెడ్డి అనుచరులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి నియోజకవర్గంలో తనకు అనుచరులున్నారని, కావాలంటే తానూ రౌడీయిజం చేయగలనని ఆయన చెప్పారు.
అయితే మంత్రి దామోదర్ రెడ్డి తరహాలో దాడి చేయించడం తనకు సరిపడదని ఆయన మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. తనపై షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని నియోజక వర్గ సమావేశాల్లో పదే పదే మంత్రి వ్యాఖ్యానించడం సరికాదని, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దామోదర్ రెడ్డి అతిగా వ్యవహరించారని ఉప్పూనూతల ఆరోపించారు. మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఉప్పునూతలపై మంత్రి దామోదర్ రెడ్డి అనుచరులు సోమవారం దాడికి పాల్పడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి అనుచరులకు, ఉప్పునూతల వర్గీయులకు మధ్య జరిగిన ఈ ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన ఉప్పునూతలపై మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు.
|