రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగేళ్ళ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశ రాజధానిలో ఉన్న ఆయన ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలు అంధకారంలో జీవనం సాగించాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. కరెంటు కోతల వల్ల రైతులు పంటలు పండించుకోలేక, నాట్లు వేసుకోలేక అల్లడిపోతున్నారన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 17 విద్యుత్ ప్రాజెక్టులను నడిపేందుకు రూ.36,386 కోట్లు అవసరం కాగా, కాంగ్రెస్ సర్కారు కేవలం రూ.4,807 కోట్లే ఖర్చుపెట్టిందని బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా విద్యుత్ కోతను సృష్టించిన వైఎస్ సర్కారు 3,219 యూనిట్ల విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
విద్యుత్ కోతతో అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నిలువాల్సిన ముఖ్యమంత్రి, తన బాధ్యతలను విస్మరించి, ప్రతిపక్షాలపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొన్ని రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని బాబు సూచించారు.
|