పార్టీ ఇచ్చే పదవులను అనుభవిస్తూ చివరి వరకు పార్టీలోనే ఉంటూ అకస్మాత్తుగా ద్రోహం చేయడం సబబు కాదని, వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమని తెదేపా సీనియర్ నేత ఎంపీ ఎర్రన్నాయుడు అన్నారు. యూపీఏకు అనుకూలంగా తమ పార్టీ ఎంపీలు ఓటు వేయడం మహాద్రోహమని పేర్కొన్నారు. వీరి చర్యలు నమ్మశక్యం కాని రీతిలో ఉండటంతో పాటు, ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని ఎర్రన్నాయుడు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, లోక్‌సభలో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాసపరీక్షలో సర్కారుకు అనుకూలంగా టీడీపీ ఎంపీ మందా జగన్నాధం ఓటేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై జగన్నాధం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. ఒక్కరిద్దరి అభిప్రాయాలనే మొత్తం పార్టీపై రుద్దుతారనీ, ఇంకొకరికి కనీసం మాట్లాడడానికి అవకాశమివ్వరని అన్నారు. అందరూ డబ్బులు సంపాదించుకునే వారేనని, అణుఒప్పందంలో అనుకూలమైన అంశాలే ఉన్నట్లు కనబడటంతో యూపీఏకు ఓటేశానని చెప్పారు.
|