మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో ఆధునికత ఉట్టిపడేలా, కార్పొరేట్ తరహాలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభోత్సవం చేశారు.
అటుపిమ్మట ఆదివారం అర్థరాత్రి దాటాక చిరంజీవి సతీసమేతంగా కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్, బావమరిది అల్లు అరవింద్, తోడల్లుడు కె.వెంకటేశ్వరరావు తదితరులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
అలాగే.. తెలుగుదేశం పార్టీకి గడ్‌బై చెప్పిన చిరంజీవికి జై కొట్టిన కోటగిరి విద్యాధరరావు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు హరిరామ జోగయ్య, చిరు పార్టీ కార్యాలయ కార్యదర్శి కేఎస్‌ఆర్.మూర్తి, మెగాస్టార్ రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా, మరికొందరు రాజకీయ నేతలు, సినీ నటులు తదితరులు హాజరయ్యారు.
ఇదిలావుండగా.. మెగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు రహస్యంగా ఉంచారు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో జూబ్లీహిల్స్ రోడ్‌కు తరలి వచ్చారు.
అలాగే.. పోలీసులకు కూడా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వివరాలను తెలియజేయలేదు. ఆ తర్వాత మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
|