రాష్ట్ర రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్న చిరు పార్టీ... గొప్ప పార్టీ కాబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. కొత్త పార్టీలెన్నివచ్చినప్పటికీ అవేమీ తమకంటే భిన్నంగా ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరం "గాంధీ పథం" ముగింపు సమావేశంలో వైఎస్సార్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా చిరంజీవి పార్టీపై వైఎస్సార్ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో పార్టీపెట్టే హక్కు అందరికీ ఉందని, సినిమా నటులుగా తమకు ప్రజల్లో ఉన్న ప్రాచుర్యం ఆధారంగా ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చునని వైఎస్సార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొత్తగా రాష్ట్రంలో అవతారమెత్తుతున్న లోక్‌సత్తా, నవతెలంగాణ ప్రజా పార్టీ (ఎన్టీపీపీ)లు ఏం చేయగలుగుతారో అవన్నీ ఇప్పుడే చేసి చూపుతున్నామని, అవన్నీ ఇప్పటికే చేసేశామని కార్యకర్తల హర్ష ధ్వనుల మధ్య వైఎస్సార్ గమ్మత్తుగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సోమవారం ఢిల్లీ బయలుదేరనున్నారు. రాజకీయ వ్యవహారాలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. సోనియాగాంధీతో పాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మగ్ పటేల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో వైఎస్సార్ భేటీ కానున్నారు.
|