సినీనటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు తిరుపతిలో జరుగనున్న బహిరంగ సభపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వివిధ సమస్యలకు ఈ సభ ద్వారా స్పష్టమైన పరిష్కారం తెలిపేందుకు కసరత్తులు జరుగుతోంది.
బహిరంగ సభ నిర్వహించిన అనంతరం ప్రజల్లోకి చిరంజీవి విస్తృత ప్రచార కార్యాక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తనను ఇంతకాలం ఆదరించిన సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు చిరంజీవి విందును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సన్నిహితుల సమాచారం.
చిరంజీవి సినీ పరిశ్రమను వీడుతున్నట్లు పరోక్షంగా తెలిపారు. ఆయన మనోభావాన్ని గ్రహించిన సన్నిహితులు సోమవారం రాత్రే సినీ ప్రముఖులకు కృతజ్ఞతా పూర్వకమైన విందును ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేపట్టారు. దీనితో ఇతర పార్టీతో సంబంధంలేకుండా సినీ పరిశ్రమలోని అందరినీ ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
|