తన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అభిమానులెవ్వరూ రావొద్దని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాలకు చెందిన అభిమానులు ప్రయాసలకోర్చి రాజధానికి రాకుండా.. తమ సొంత ప్రాంతాల్లోనే సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
కుటుంబ సభ్యుల కోరిక మేరకు... ఆ రోజంతా తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులతోనే గడపాలని భావిస్తున్నట్టు చిరంజీవి మంగళవారం వెల్లడించారు. అందువల్ల అభిమానులు తమ తమ ప్రాంతాల్లోనే సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని చిరు పిలుపునిచ్చారు. ఇకపై ప్రజా సేవకోసం అంకితం కానున్నట్టు మెగాస్టార్ చిరంజీవి గత ఆదివారం ప్రకటించిన విషయం తెల్సిందే.
ఈ ప్రకటనలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖరారైపోయింది. వచ్చే 26వ తేదీన తన రాజకీయ పార్టీ పేరుతో పాటు.. పార్టీ విధి విధానాలను వెల్లడించనున్నట్టు ప్రకటించారు. దీంతో చిరు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
|