ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రజలకు అయోమయం లేదని, నాయకుల్లోనే ఉందని నవ తెలంగాణ పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిజమాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, నేతల సమావేశంలో మాట్లాడుతూ... ప్రస్తుతం రాజకీయాలు పరిభాషగా మారిపోయాయని అన్నారు.
తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే అవకాశం లభించినప్పుడల్లా తెలంగాణ అంశాన్ని లేవనేత్తానని ఆయన వెల్లడించారు. 1956 ఏడాది నుంచి తెలంగాణను చులకన భావంతోనే చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, తాజాగా రూ.30 వేల కోట్ల విలువచేసే భూమిని అమ్మడానికి రంగం సిద్ధంచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాకు చెందిన వనరులన్నింటినీ కొల్లగొట్టేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం తెలంగాణా అంశం చివరి దశకు చేరుకుందని, రాష్ట్రసాధన కోసం వేలాది కార్యకర్తలు తమ పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా సుమారు 15 వేల మందిని తమ పార్టీలో సభ్యత్వం కల్పించామని తెలిపారు. ఈ సమావేశంలో ఇ.పెద్దిరెడ్డి, నర్రా రవికుమార్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
|