ప్రకాశం జిల్లా వాసులకు తాగు, సాగు నీరు అందించేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా డోర్నాల్ మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో సొరంగ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ... వెలుగొండ ప్రాజెక్ట్ పనులకు ఉపయోగిస్తున్న యంత్రాన్ని అత్యాధునికమైందని, సొరంగనిర్మాణానికై అమెరికా నుంచి దీనిని దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్ణాణం వల్ల వెలుగొండ ప్రాంత వాసులందరికి కరువుకాటకాలు దరిచేరబోదని ఆయన వెల్లడించారు. గతంలో ఎన్నిపార్టీలు అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంతాల అభివృద్ధిపై నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించిందని విమర్శించారు.
ఇప్పటికే రామతీర్థం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని, దీని ద్వారా సుమారు అరవై, డెభ్బై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన ఈ సందర్భంలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులను చేపట్టామని చెప్పారు. నెల్లూరు జిలాకు పలు పరిశ్రమలు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. తమ పాలనలో డ్వాక్రా మహిళలను ఆదుకోవడానికి రూ.11 వేల కోట్లును రుణాలుగా అందించామన్నారు.
ప్రకాశం జిల్లాకు సిమెంట్ రోడ్లకు రూ.20 లక్షలు అందించామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని సుమారు 4.38 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. 15 లక్షమందికి తాగు నీరు కూడా అందుతుందని, రూ.3.470 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌కు శ్రీశైలం డ్యాం నుంచి నీరును అందిస్తామని తెలిపారు. సాగునీరు సరఫరాను నల్లమల అడవుల్లో నుంచి సొరంగాల ద్వారా వెలిగొండ రిజర్వాయర్ కు తరలిస్తామని వెల్లడించారు.
|