ఈనెల 26వ తేదీన తిరుపతిలో జరుగనున్న సినీ నటుడు చిరంజీవి రాజకీయ బహిరంగ సభకు భారీగా జనాన్ని తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా.. కడప జిల్లా నుంచి లక్షలాది మంది ప్రజలను తిరుపతికి తరలించేందుకు మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా కొనసాగారు.
తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన, కొద్ది రోజుల కిందట ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన చిరంజీవి పార్టీలో చేరుతున్నారు. ఈ మేరకు తిరుపతిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 50 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే వందల సంఖ్యలో వాహనాలను సమకూర్చినట్టు సమాచారం. అంతేకాకుండా.. చిరు సభకు మరింత సంఖ్యలో, ఎన్నడూ లేని విధంగా కార్యకర్తలను తరలించేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నడుపాల్సిందిగా రైల్వే అధికారులను సైతం కోరినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. వచ్చే 26వ తేదీన తిరుపతిలోని ఆవిలాల మైదానంలో చిరు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న విషయం తెల్సిందే.
|