ఓ ప్రేమ వివాహం విషయంలో నెలకొన్న వివాదంలో మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ స్థాపకుడు చిరంజీవి కేంద్ర బిందువుగా మారారు. ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు కుమారుడికి జరిగిన ఈ వివాహానికి ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరు కావడం ప్రస్తుత వివాదానికి కారణమైంది.
ఈ విషయం వివరాల్లోకి వెళ్తే... తమ్మిన సుబ్బారావు కుమార్తె అయిన నళినితో కత్తి పద్మారావు కుమారుడు వివాహం జరిగింది. కులాంతర వివాహంగా పలువురు ప్రముఖలు సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశ్వీరదించడం జరిగింది.
అయితే ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లితండ్రులు ఓ ప్రైవేటు ఛానల్‌తో మాట్లాడుతూ తమ ఇష్టం లేకుండా, అమ్మాయిని బలవంతం పెట్టి ఈ పెళ్లి జరిపించారని పేర్కొన్నారు. ఈ పెళ్లి కోసం చిరంజీవి తమ అమ్మాయిని దత్తత కూడా చేసుకున్నారని వారు ఆరోపించారు.
ఓ ఆడపిల్లకు తండ్రి అయిన చిరంజీవి తమకు తెలియకుండా తమ అమ్మాయి పెళ్లి జరిపించడం ఎంత వరకు న్యాయమని అమ్మాయి తల్లి ప్రశ్నిస్తోంది. అయితే ఈ విషయమై అబ్బాయి తండ్రి కత్తి పద్మారావు, ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి ప్రభాకర్‌లు మాట్లాడుతూ ఈ పెళ్లికి చిరంజీవి అతిథిగా మాత్రమే హాజరయ్యారని అంతకు మించి ఆయనకు ఈ పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.
|