వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే ముందుగా లక్షమంది సైన్యంతో కుటుంబాల వారీగా సర్వేచేయిస్తామని చెప్పారు. అర్హులైన కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం కుల ప్రాతిపదికన కొనసాగుతున్న వసతిగృహాలను రద్దు చేస్తామని చెప్పారు. వసతిగృహాల స్థానంలో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తాము పదవులను ఆశించడంలేదని, దళితుడినే తాను ముఖ్యమంత్రిని చేస్తానని ఏనాడో చెప్పానని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇందిరాగాంధీ హయాం నుంచి దళితుల బతుకులు అట్టడుగునే ఉన్నాయని చెప్పారు. మైనారిటీలకు నాలుగు లక్షల విలువ చేసే వక్ఫ్ భూములున్నా, పిల్లలను చదివించుకోలేని దుస్థితి నెలకొందన్నారు. బీసీల్లోనూ నైపుణ్యం కలిగిన నాయకులు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వీరికి అధిక స్థానాలు కల్గిస్తానని తెలిపారు.
|