శంషాబాద్ విమానాశ్రయంలో యూజర్ ఛార్జీలను వసూలు చేస్తున్న అంశంపై శనివారం శాసనసభలో రభస చోటు చేసుకుంది. యూజర్ ఛార్జీల పేరుతో సగటు ప్రయాణికుల వద్ద అదనపు సొమ్ము వసూలు చేయడం అన్యాయమని విపక్షాలు ఆరోపించాయి.
జీఎంఆర్‌పై ఒత్తిడి తీసుకు వచ్చి యూజర్ ఛార్జీలను తక్షణమే రద్దుచేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ... ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, దీనిపై విమానయాన శాఖతో పాటు జిఎంఆర్ సంస్థలో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవల్సిన అంశమని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
హజ్ యాత్రికులకు యూజర్ ఛార్జీలపై మినహాయింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం బదులిచ్చింది. ఛార్జీల తగ్గింపు అంశంపై ఓ ప్రత్యేక కమిటీని వేస్తామని ప్రభుత్వం చెప్పింది. చర్చల సందర్భంగా ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వం జీఎంఆర్ గ్రూప్ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని తెలుగుదేశం పార్టీ, ఎంఐఎం తీవ్రంగా విమర్శించాయి.
|